బిల్లుల క్రమబద్ధీకరణ: నూతన షెడ్యూల్ తయారు చేసిన ఆర్థికశాఖ
బిల్లుల క్రమబద్ధీకరణ: నూతన షెడ్యూల్ తయారు చేసిన ఆర్థికశాఖ
వివిధ శాఖల నుండి ఇష్టానుసారంగా వస్తున్న
బిల్లులను క్రమబద్దీకరించేందుకు ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. ఏ
తరహాబిల్లులను ఎప్పుడు సమర్పించాలన్న దానిపై నిర్దిష్టమైన షెడ్యూల్‌ను
ఖరారు చేసింది. ఈ షెడ్యూల్ మేరకే బిల్లులను సమర్పించాలని అన్ని శాఖలకు
ఆదేశాలు జారీ చేసింది. ప్రతి నెలా నిర్దిష్టమైన తేదీల్లో గుర్తించిన
బిల్లులను మాత్రమే ప్రతిపాదించాలని స్పష్టం చేసింది. గత రెండేళ్లుగా వివిధ
శాఖల నుంచి వస్తున్న బిల్లులను అధ్యయనం చేసిన ఆర్థికశాఖ పలు సమస్యలను
గుర్తించింది. కొన్ని శాఖల నుంచి డిడి డ్రాయింగ్ డిస్పర్నమెంట్ ఆఫీసర్లు
సమయ పాలన పాటించకుండా అనునిత్యం బిల్లులను పంపిస్తున్నట్లు గుర్తించారు.
ఇది ఏమాత్రం ఆరోగ్యవంతమైన విధానం కాదని ఆర్థికశాఖ అధికారులు అంటున్నారు. ఈ
విధానం, ఆర్థిక యాజమాన్యం పైనా వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని వారు
అంటున్నారు. ఇలా ఇష్టానుసారంగా వచ్చే బిల్లుల వల్ల చివరి క్షణాల్లో వత్తిడి
పెరుగుతోందని ఆర్థికశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే
సర్వర్లు జామ్ కావడం, ఇతర సాంకేతిక సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నట్లు
గుర్తించారు. అందుకే ఇకపై ఇటువంటి సమస్యలను అధిగమించేందుకుగాను షెడ్యూల్
మేరకే బిల్లులు సమర్పించాలని నిర్దేశించారు.
నూతన షెడ్యూల్ ఇలా...
ఇకపై ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ
వరకు రాజభవన్, హైకోర్టు, న్యాయ బిల్లులు, అప్పులపై చెల్లించాల్సిన అసలు
వాయిదా, వడ్డీలు, ఎన్నికల సంబంధిత బిల్లులు, పరీక్షలు, ప్రోటోకాల్, ప్రకృతి
వైపరీత్యాలు, ఎసి బిల్లులు వంటివి తప్ప ఇతర బిల్లులు పంపించవద్దని
నిర్దేశించింది.
అలాగే ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు స్కాలర్షిప్పులు, ప్రోత్సాహకాలు, ఎరియర్స్, సప్లిమెంటరీ బిల్లులను మాత్రమే స్వీకరించనున్నారు.
11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బడ్జెట్‌కు సంబంధించిన బిల్లులు, జీపీఎఫ్, రుణాలు, అడ్వాన్సులు, పీడి ఖాతాల బిల్లులు
17 నుంచి 20 తేదీ వరకు రెగ్యులర్ ఫింఛను,
అన్ని రకాల ఉద్యోగుల జీతాల బిల్లులు, అంగన్వాడీ, వర్కర్లు, హోంగార్డులు,
ఇతరులకు ఇవ్వాల్సిన వేతనం, విఆర్‌ఎలకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం, సామాజిక
పింఛన్లు, బియ్యం, విద్యుత్ వంటి సబ్సిడీ బిల్లులు మాత్రమే సమర్పించాలని
నిర్దేశించారు.
26వ తేదీ నుంచి నెలాఖరు వరకు తిరిగి రాజభవన్,
హైకోర్టు, న్యాయ బిల్లులు, అప్పుల పై చెల్లించాల్సిన అసలు వాయిదా,
వడ్డీలు, ఎన్నికల సంబంధిత బిల్లులు, పరీక్షలు, ప్రోటోకాల్, ప్రకృతి
వైపరీత్యాలు, ఎసి బిల్లులు వంటివి మాత్రమే అంగీకరించనున్నట్లు ఆర్థికశాఖ
పేర్కొంది.
పై విభాగాల్లో లేని బిల్లులను ప్రతి నెల 11వ తేదీ నుంచి 20 మధ్యలో మాత్రమే సమర్పించాలని నిర్దేశించింది.
No Comment to " బిల్లుల క్రమబద్ధీకరణ: నూతన షెడ్యూల్ తయారు చేసిన ఆర్థికశాఖ "