Sukanya Samriddhi Yojana Rules 2019: సుకన్య సమృద్ధి యోజన రూల్స్ ప్రకటించిన ప్రభుత్వం
Sukanya Samriddhi Yojana Rules 2019: సుకన్య సమృద్ధి యోజన రూల్స్ ప్రకటించిన ప్రభుత్వం
Sukanya Samriddhi Yojana Account Rules 2019 | అమ్మాయి పేరుపైన అకౌంట్ ఓపెన్ చేసి నెలనెలా డబ్బులు జమ చేస్తే వాళ్ల పెళ్లి, లేదా పైచదువులకు ఆ డబ్బు ఉపయోగపడుతుంది. మిగతా పొదుపు పథకాల కన్నా వడ్డీ అధికంగా వస్తుంది.
మీరు మీ అమ్మాయి పేరు మీద సుకన్య సమృద్ధి యోజన-SSY అకౌంట్ ఓపెన్ చేశారా? ఈ అకౌంట్‌లో నెలనెలా డబ్బులు జమ చేస్తున్నారా? ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన నిబంధనల్ని ప్రకటించింది. ఆడపిల్లల చదువు, పెళ్లిళ్ల సమయంలో తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అమ్మాయిల పేరుపైన అకౌంట్ ఓపెన్ చేసి నెలనెలా డబ్బులు జమ చేస్తే వాళ్ల పెళ్లిళ్లు, లేదా పైచదువులకు ఆ డబ్బు ఉపయోగపడుతుంది. మిగతా పొదుపు పథకాల కన్నా వడ్డీ అధికంగా వస్తుంది.
సుకన్య సమృద్ధి యోజన-SSY 2019 నియమనిబంధనలు ఇవే...
1. అకౌంట్ ఓపెనింగ్: సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌ను 10 ఏళ్ల లోపు వయస్సు ఉన్న అమ్మాయి పేరు మీద తండ్రి లేదా సంరక్షకుడు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో ఒకరి పేరు మీద ఒకే అకౌంట్ ఉండాలి. అమ్మాయి బర్త్ సర్టిఫికెట్‌తో పాటు తండ్రి లేదా సంరక్షకుడికి సంబంధించిన డాక్యుమెంట్స్ తప్పనిసరి. ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిల పేరు మీద సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఒకవేళ ట్విన్స్, ట్రిప్లెట్స్ అయితే రెండు కన్నా ఎక్కువ అకౌంట్లు ఓపెన్ చేయడానికి అనుమతి ఉంటుంది.
2. డిపాజిట్లు: కనీసం రూ.250 డిపాజిట్‌తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఆ తర్వాత రూ.50 చొప్పున యాడ్ చేస్తూ ఎంతైనా జమ చేయొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 డిపాజిట్ చేయాలి. గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు జమ చేయొచ్చు. డిపాజిట్ సమయంలో ఏదైనా అకౌంటింగ్ ఎర్రర్ ఉంటే అకౌంట్‌లో వడ్డీ జమ కాదు. డిపాజిట్ చేసిన డబ్బులు తిరిగి వస్తాయి. అకౌంట్ ఓపెన్ చేసిననాటి నుంచి 15 ఏళ్ల వరకు డబ్బులు జమ చేస్తూ ఉండాలి. ఒకవేళ కనీస మొత్తం జమ చేయకపోతే అకౌంట్ డిఫాల్ట్ అవుతుంది. 15 ఏళ్ల లోపు ఎప్పుడైనా అకౌంట్ తిరిగి రెగ్యులరైజ్ చేయొచ్చు. ఇందుకోసం ప్రతీ ఏడాదికి రూ.50 చొప్పున పెనాల్టీ చెల్లించాలి. ఒకవేళ రెగ్యులరైజ్ చేయకపోతే అకౌంట్ క్లోజ్ అయిన తర్వాత డబ్బులు వడ్డీతో తిరిగి వస్తాయి.
3. డిపాజిట్లపై వడ్డీ: ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌కు వార్షికంగా 8.4 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రతీ నెల ఐదో తేదీ నుంచి నెలాఖరు లోపు వడ్డీని లెక్కిస్తారు. అంటే ఐదో తేదీలోపు అకౌంట్‌లో ఎంత ఉంటే అంత మొత్తానికే వడ్డీ లభిస్తుంది. ప్రస్తుత వడ్డీ లెక్కన చూస్తే ఏడాదికి రూ.1.5 లక్షల చొప్పున 15 ఏళ్లు జమ చేస్తే సుమారు రూ.45 లక్షలు అకౌంట్‌లో ఉంటాయి. అకౌంట్ 21 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది కాబట్టి సుమారు రూ.73 లక్షలు తిరిగొస్తాయి.
4. అకౌంట్ ఆపరేషన్: అమ్మాయికి 18 ఏళ్లు వచ్చేవరకు తండ్రి లేదా సంరక్షకుడు మాత్రమే అకౌంట్‌ను ఆపరేట్ చేస్తారు. అమ్మాయికి 18 ఏళ్లు దాటిన తర్వాత సొంతగా అకంట్ ఆపరేట్ చేయొచ్చు.
5. ప్రీమెచ్యూర్ క్లోజర్: అకౌంట్ హోల్డర్ చనిపోతే డెత్ సర్టిఫికెట్ సమర్పించి అకౌంట్ క్లోజ్ చేయొచ్చు. జమ చేసిన మొత్తం వడ్డీతో సహా తండ్రి లేదా సంరక్షకుడికి అందుతాయి. అకౌంట్ హోల్డర్ ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నా, తండ్రి లేదా సంరక్షకుడు చనిపోయినా అకౌంట్ క్లోజ్ చేయొచ్చు. అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌తో పాటు వడ్డీ లభిస్తాయి.
6. విత్‌డ్రాయల్: అమ్మాయికి 18 ఏళ్లు పూర్తైన తర్వాత లేదా 10వ తరగతి పాసైన తర్వాత ఉన్నత విద్య కోసం అకౌంట్‌లో 50 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం విద్యాసంస్థలో అడ్మిషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. జమ చేసిన డబ్బుల్లో 50 శాతం మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాల పద్ధతిలో తీసుకోవచ్చు.
7. మెచ్యూరిటీ తర్వాత అకౌంట్ క్లోజర్: అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 21 ఏళ్లకు అకౌంట్ మెచ్యూర్ అవుతుంది. 21 ఏళ్ల లోపు కూడా అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. 18 ఏళ్లు దాటిన తర్వాత అమ్మాయి పెళ్లి చేస్తున్నటైతే సరైన ఆధారాలు చూపించి డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు. పెళ్లికి నెల ముందు లేదా పెళ్లికి మూడు నెలల తర్వాత అకౌంట్ క్లోజ్ చేయొచ్చు. అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌తో పాటు వడ్డీ లభిస్తాయి
No Comment to " Sukanya Samriddhi Yojana Rules 2019: సుకన్య సమృద్ధి యోజన రూల్స్ ప్రకటించిన ప్రభుత్వం "