News Ticker

Menu

సైనిక్‌ స్కూళ్లలో 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు ప్రకటన

సైనిక్‌ స్కూళ్లలో 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు ప్రకటన
 
విద్యార్థి దశ నుంచే దేశం పట్ల అంకితభావాన్ని పెంపొందింపజేసే చక్కటి వేదికలు సైనిక్‌ స్కూళ్లు. రక్షణ రంగంలోకి ప్రవేశించడానికి కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వీటిని నెలకొల్పింది. ఏటా ఎందరో త్రివిధ దళాల్లో చేరడానికి ఇవి దోహదపడుతున్నాయి. క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు 10,000 మంది సైనిక్‌ స్కూల్‌ విద్యార్థులు త్రివిధ దళాల్లో పనిచేస్తున్నారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీల్లో శిక్షణ పొందుతున్న 25 శాతం మంది ఇక్కడి నుంచి వెళ్లినవారే. ప్రస్తుతం ఈ స్కూళ్లల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది.
దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 31 సైనిక్‌ స్కూళ్లను కేంద్రప్రభుత్వం నిర్వహిస్తోంది. 2020-21 విద్యాసంవత్సరానికి ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు సైనిక్‌ స్కూల్స్‌ సొసైటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిల్లో ఆరు నుంచి పన్నెండో తరగతి వరకు తరగతులుంటాయి. ఇంగ్లిష్‌ మాధ్యమం, సీబీఎస్‌ఈ విధానంలో విద్యాబోధన ఉంటుంది. అన్ని రకాల ఆటలు, షూటింగ్‌, ఫైరింగ్‌, హార్స్‌ రైడింగ్‌, సాహస క్రీడల్లో శిక్షణ ఇస్తారు. హాస్టల్‌ వసతి జూనియర్‌, సీనియర్‌ విద్యార్థులకు వేర్వేరు. ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరంలోని కోరుకొండ, చిత్తూరులోని కలికిరిలో సైనిక్‌ స్కూళ్లున్నాయి. వీటిలో ప్రవేశాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. బాలురకు మాత్రమే వీటిలో ప్రవేశాలుంటాయి. ఆరో తరగతిలో ప్రవేశానికి 31 మార్చి 2020 నాటికి విద్యార్థి వయసు 12 ఏళ్లు మించకూడదు. తొమ్మిదో తరగతికి 15 సంవత్సరాలు దాటకూడదు. కింది తరగతులను ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదవడం తప్పనిసరి.
ఎంపిక విధానం
ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటిదశలో ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ప్రవేశపరీక్ష ఉంటుంది. వీటిలో ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలుంటాయి. ఆరోతరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో మొదటి పేపర్‌ 250 మార్కులకు రెండున్నర గంటల వ్యవధితో ఉంటుంది. ఇందులో మ్యాథమేటిక్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌, లాంగ్వేజ్‌ ప్రశ్నలు వస్తాయి. రెండో పేపర్‌ 50 మార్కులకు అరగంట సమయంతో ఉంటుంది. దీనిలో ఇంటెలిజెన్స్‌ టెస్ట్‌ ఉంటుంది. తొమ్మిదో తరగతి పరీక్షకు మొదటి పేపర్‌ 350 మార్కులకు రెండున్నర గంటల సమయంతో ఉంటుంది. దీనిలో మ్యాథమేటిక్స్‌, ఇంగ్లిష్‌, జనరల్‌ సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ల నుంచి ప్రశ్నలుంటాయి. రెండో పేపర్‌ 50 మార్కులకు అరగంట వ్యవధితో ఉంటుంది. ఇందులో ఇంటెలిజెన్స్‌ ప్రశ్నలుంటాయి. దీనిలో అర్హత సాధించినవారికి శరీర దార్ఢ్య, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు.
ఎన్ని సీట్లు?
కోరుకొండ స్కూల్లో ఆరోతరగతిలో 60 సీట్లు, తొమ్మిదిలో 20 ఉన్నాయి. కలికిరిలో ఆరోతరగతిలో 70 సీట్లున్నాయి. పరీక్షలో ఉత్తీర్ణత, చేరికల ఆధారంగా సీట్ల సంఖ్య పెరగొచ్చు, తగ్గొచ్చు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం సీట్లలో 15 శాతం ఎస్సీ, 7.5 శాతం ఎస్టీ విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలినవాటిలో 67 శాతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల జనరల్‌ కేటగిరి విద్యార్థులకు కేటాయిస్తారు. అందులో 33 శాతం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారికి ఆయా రాష్ట్రాల పురుష జనాభా ఆధారంగా కేటాయిస్తారు. మరో 25 శాతం త్రివిధ దళాలకు చెందిన విధుల్లో ఉన్న లేదా పదవీ విరమణ పొందిన సైనికుల పిల్లలకు కేటాయిస్తారు. మిగిలిన సీట్లను మెరిట్‌ ఆధారంగా సొంత రాష్ట్రం వారికి ఇస్తారు. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ కేటగిరిల్లో సీట్లు మిగిలితే వాటిని జనరల్‌ కేటగిరి ద్వారా భర్తీ చేస్తారు. వీరు మొదటిదశలో అర్హత సాధించాలి.
ఉపకారవేతనాలు
అర్హులైన స్థానిక విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్కాలర్‌షిప్‌ సౌకర్యం కల్పిస్తుంది. రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఉపకారవేతనాన్ని అందిస్తుంది. బీసీ విద్యార్థుల తల్లిదండ్రుల నెలసరి ఆదాయం రూ.15000 లోపు ఉన్నవారికి స్కాలర్‌షిప్‌ ఇస్తారు. వార్షిక ఆదాయం రూ.65,000 - 2,00,000 లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీలకు స్కాలర్‌షిప్‌ సదుపాయం ఉంటుంది. వార్షిక పరీక్షల్లో 70శాతం మార్కులు వచ్చిన బీసీలకు, 60శాతం వచ్చిన ఎస్సీ, ఎస్టీలకు మెరిట్‌ స్కాలర్‌షిప్‌ అందిస్తారు. అర్హత ఆధారంగా ఏటా రూ.34,000 వరకు వస్తుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.32,000, కేంద్ర ప్రభుత్వం రూ.2000 ఇస్తుంది. ప్రతి విద్యార్థికి దుస్తులకు రూ.1000, ఆహారానికి రూ.5900 అందిస్తారు.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 23
ప్రవేశపరీక్ష తేది: జనవరి 05

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " సైనిక్‌ స్కూళ్లలో 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు ప్రకటన "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM