అమ్మ ఒడి’ ఒకరికే
అమ్మ ఒడి’ ఒకరికే
* కుటుంబంలో పిల్లలెందరున్నా తల్లికే..*
* బడ్జెట్‌లో 6455.80 కోట్లు కేటాయింపు*
* ఒకటి నుంచి పది, ఇంటర్ కలుపుకొని*
* 43 లక్షలమందికి రూ.15వేలు చొప్పున*
* తెల్ల రేషన్ కార్డు ఉండటం తప్పనిసరి*
*అమరావతి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): నవరత్నాల్లో ఒకటైన ‘అమ్మఒడి’ పథకం కోసం బడ్జెట్‌లో రూ.6455.80 కోట్లు కేటాయించారు. ఇందులో ఒకటి నుంచి పదోతరగతి వరకు పిల్లలకు రూ.5,595 కోట్లు, ఇంటర్ విద్యార్థులు రూ.860 కోట్లు అందజేస్తారు. ఒక కుటుంబంలో చదివే పిల్లలు ఎందరున్నా, తల్లికి మాత్రమే ఈ పథకం లబ్ధిని అందిస్తామని శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదువుతున్న పిల్లల తల్లులకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తాం’ అని వెల్లడించింది. ‘అమ్మ ఒడి’ పథకాన్ని ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తింపజేయాలని సర్కారు తొలుత భావించింది. అయితే ఆ తర్వాత ఇంటర్మీడియెట్ వరకు ఈ పథకాన్ని విస్తరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు దాదాపు 70 లక్షల మంది, రెండేళ్ల ఇంటర్మీడియెట్ కోర్సును సుమారు 10లక్షలమంది చదువుతున్నారు. అయితే వీరిలో దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలు, అంటే తెల్లరేషన్ కార్డు కలిగి ఉండటం, ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నప్పటికీ తల్లికే లబ్ధి చేకూర్చేలా ఈ పథకం నిబంధనలను రూపొందించారు. ఈ రెండు అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటే ‘అమ్మ ఒడి’ పథకం కింద దాదాపు 43లక్షల మంది అర్హులు ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. ఇందులో 1 నుంచి పదో తరగతుల పిల్లలు 37.30లక్షల మంది కాగా, మిగిలిన 5.73లక్షల మంది ఇంటర్మీడియెట్ విద్యార్థులు. వీరందరికీ ప్రస్తుత విద్యా సంవత్సరంలో వచ్చే జనవరి 26న ‘అమ్మ ఒడి’ పథకం కింద రూ.15వేల చొప్పున అందించనున్నారు. ఐ.టి.ఐ, పాలిటెక్నిక్ కోర్సులు చదువుకునేవారికి కూడా ‘అమ్మ ఒడి’ పథకాన్ని వర్తింపజే యాలన్న డిమాండ్లు వచ్చాయి. కానీ ఆ విషయం బడ్జెట్‌లో ప్రస్తావించలేదు.
No Comment to " అమ్మ ఒడి’ ఒకరికే "