ఎయిడెడ్ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు
ఎయిడెడ్ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు
* వెయిటేజీకి 35 మార్కులు
* పాత ఉత్తర్వులకు సవరణ తీసుకొచ్చిన పాఠశాల విద్యాశాఖ ఈనాడు, అమరావతి: ఎయిడెడ్ పాఠశాలల్లో పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వు నెంబరు 43కు సవరణ తీసుకొచ్చింది. ఈ మేరకు ఫిబ్రవరి 16న ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం అన్ని పాఠశాలల్లో రేషనలైజేషన్ చేయాలని, అనంతరం ఏర్పడే ఖాళీలకు మొదట పదోన్నతులు కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా యూనిట్‌గా రోస్టర్ రిజర్వేషన్ అమలు చేయనున్నారు. మైనార్టీ సంస్థలకు మాత్రం మినహాయింపు నిచ్చారు. మైనార్టీ అభ్యర్థి ఉంటే ఆయనతోనే భర్తీ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ ఖాళీలను తర్వాత రాబోయే నియామక ప్రక్రియలో చూపిస్తారు.
* జిల్లా స్థాయిలో నియామక పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో రూపొందిస్తారు. అదనపు సంచాలకుల స్థాయి అధికారి పరీక్షలు నిర్వహిస్తారు. డీఎస్సీకి వర్తించే అర్హతలు ఉంటాయి.
* ఎలాంటి మౌఖిక పరీక్షలు ఉండవు.
* మొత్తం 100 మార్కుల్లో 65 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.
* ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ఐదు మార్కులు వెయిటేజీ.
* ఎయిడెడ్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల అనుభవానికి 25 మార్కులు కేటాయించారు. మొదటి మూడేళ్లకు ఒక్క మార్కు, ఆ తర్వాత ప్రతి ఏడాదికీ ఒక మార్కు ఇస్తారు. గరిష్ఠంగా 25 మార్కుల వరకు వెయిటేజీ ఉంటుంది.
* అభ్యర్థులకు మరో 5 మార్కుల వెయిటేజీ ఇచ్చారు. ఇందులో పీజీ, పీహెచ్‌డీకి 3 మార్కులు, రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడా పత్రాలు ఉంటే 2 మార్కులు ఇస్తారు.
* బోధనేతర సిబ్బంది నియామకానికి ప్రత్యేకంగా మరో ఆదేశాలు ఇవ్వనున్నారు.
* రేషనలైజేషన్ చేసిన తర్వాత మిగిలే ఉపాధ్యాయులను డీఈవో ఫూల్‌లో ఉంచుతారు.
అనుభవ పత్రాలపై అస్పష్టత
ఎయిడెడ్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల అనుభవానికి ఏకంగా 25 మార్కులు కేటాయించారు. పాఠశాల విద్యాశాఖ అనుమతి పొందిన పోస్టుల్లో పని చేస్తున్న వారి అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటారా? లేక యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా నియమించుకున్న ఉపాధ్యాయుల అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటారా? అనే దానిపై స్పష్టత కొరవడింది. 25 మార్కులు ఉన్నందున ఉద్యోగాల ఎంపికలో ఇది కీలకంగా మారనుంది.
No Comment to " ఎయిడెడ్ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు "