పదో తరగతి పరీక్షల ప్రిపరేషన్ - ముఖ్యమైన ప్రశ్నలు
పదో తరగతి పరీక్షల ప్రిపరేషన్ - ముఖ్యమైన ప్రశ్నలు
పరీక్షల ముందు ఏం చదవాలి? ఎలా చదవాలి? అనే సందేహాలు
విద్యార్థులను భయాందోళనలకు గురి చేస్తూంటాయి. అయితే తగిన మెలకువలు
పాటిస్తే వాటిని అధిగమించి, పరీక్షల్లో మంచి స్కోరు సంపాదించవచ్చు.
పదోతరగతి విద్యార్థులకు శ్రమించే తత్వం, సన్నద్ధత చాలా ముఖ్యం. కష్టపడి
చదవటం అలవాటు చేసుకోవాలి. చదివేటప్పుడూ, రాసేటప్పుడూ ‘ఇక చాలు’ అనే భావన
రానీయకండి. ఇంకాస్త చదివితే మార్కులు పెరుగుతాయి. కొంచెం ఆలోచించి రాస్తే
మరో అర మార్కు సంపాదించవచ్చు అనే భావనతో పరీక్షలు రాయండి.
ప్రశాంతత: పరీక్షలంటే భయపడితే చదివింది కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. వాటి గురించి భయపడాల్సిన అవసరమే లేదు. సన్నద్ధమయ్యేటప్పుడూ, పరీక్షలు రాసేటప్పుడూ కూడా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండటం ఎంతో అవసరం. ‘నేను సాధించగలను, తప్పక సాధిస్తాను’ అనే విశ్వాసాన్ని పెంచుకోవాలి.
చేతిరాత: పరీక్షల్లో చేతిరాతకు ప్రాధాన్యం ఉంటుంది. అందువల్ల దీనిపై శ్రద్ధ వహించాలి. ఒకవేళ మీ చేతిరాత బాగుండకపోతే ఆందోళన చెందాల్సిన పనిలేదు. దస్తూరి అందంగా ఉండటం ముఖ్యం కాదు; మీరు రాసింది దిద్దేవారికి అర్థం కావాలి. అందుకు పదానికీ పదానికీ¨ మధ్య కాస్త ఖాళీ ఇవ్వండి. అలాగే ప్రతి రెండు వాక్యాల మధ్యా కొంచెం దూరం పాటించండి. అంతే!
పునశ్చరణ: పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ ఇంతకుముందు చదివిన ప్రశ్నలనే పునశ్చరణచేస్తూ అవగాహన పెంచుకోవాలి. పరీక్షకు ముందు సబ్ హెడ్డింగ్స్, ముఖ్యమైన పాయింట్లు మాత్రమే చదవాలి. 1, 2, 4 మార్కుల ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలపై పట్టు సాధించాలి. ఛాయిస్ లేని 1/2, 1, 2 మార్కుల ప్రశ్నలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. రోజూ ఒకటి లేదా రెండు వ్యాసరూప ప్రశ్నలు రాయడాన్ని సాధన చేస్తే పరీక్షలో వేగంగా, తప్పులు లేకుండా విషయాన్ని వివరించడం సాధ్యమవుతుంది. స్టడీ మెటీరియల్‌లోని ప్రశ్నలను ఇప్పటికే చాలావరకు చదివిఉంటారు. వాటిని మినహాయించి మిగతా ప్రశ్నలపై దృష్టి పెట్టండి. జవాబులను చదివేసమయంలో బిట్లుగా వచ్చే పాయింట్లను అండర్‌లైన్ చేసి ఉంచుకోండి. పరీక్షలు సమీపించినప్పుడు వాటిని పునశ్చరణ చేయండి.
No Comment to " పదో తరగతి పరీక్షల ప్రిపరేషన్ - ముఖ్యమైన ప్రశ్నలు "